..

అమృత్ పథకం కింద రూ.24 కోట్లు తెచ్చుకునేందుకు బాపట్ల జనాభా 1,07,000 అని చూపించిన ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం 84,000 మాత్రమే అంటోందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మండిపడ్డారు.

లక్ష జనాభా దాటినందున నిబంధనల ప్రకారం 48 వార్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 84,000 నిజమైతే అమృత్ నిధులను వెనక్కి ఇస్తారా అని ప్రశ్నించారు.

ఒక వార్డులో 800 ఓట్లు, మరో వార్డులో 2,200 ఓట్లు ఉంటే నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని అన్నారు. రూల్ నంబర్ 5, ప్రభుత్వ జీవోల ప్రకారం ప్రతి వార్డుకు సగటున 1,680 ఓట్లు (±10 శాతం) ఉండేలా, భౌగోళిక సరిహద్దులు దెబ్బతినకుండా విభజన చేయాలన్నారు.

గూగుల్ మ్యాప్స్ వంటివి వాడకుండా, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సర్వే నంబర్లు కలుపుతున్నారని, వార్డు హద్దుల సమాచారం ఇవ్వకుండా హడావిడిగా అభ్యంతరాలు అడగడం దారుణమని ఆరోపించారు. నియోజకవర్గంలో 19,000 దొంగ ఓట్లు ఉన్నట్లు అధికారులే గుర్తించారని, వాటితోనే ఎన్నికలకు వెళ్తారా అని నిలదీశారు.కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అందరికీ సమాన అవకాశాలు ఉండేలా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. రూల్ బుక్ ప్రకారం ఎన్నికలు జరిగితే సిద్ధమని, గత ప్రభుత్వ అభివృద్ధి ఆధారంగానే ప్రజల తీర్పు కోరతామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.