పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు విచ్చలవిడిగా ఆర్ఓ ప్లాంట్లు.. అనుమతులున్నాయా..? నాణ్యత పరీక్షలు జరుగుతున్నాయా..? ప్రజల ఆరోగ్యంపై ఎవరి బాధ్యత..?

పుంగంగనూరు(రాధే సింధూరం)పుంగనూరు నియోజకవర్గం వ్యాప్తంగా మినరల్ వాటర్ పేరుతో సాగుతున్న నీటి వ్యాపారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రం వరకు వరుసగా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూతుండగా, వాటిలో ఎన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి, ఎన్ని ప్లాంట్లు అన్ని అనుమతులతోనే నడుస్తున్నాయా అనే అంశాలపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.ప్రజలకు తాగునీటిగా విక్రయిస్తున్న నీరు నిజంగా మినరల్ వాటర్ ఉందా లేక సాధారణంగా శుద్ధి చేసిన నీటినే మినరల్ వాటర్ పేరుతో మార్కెట్ చేస్తున్నారా అనే అనుమానాలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. రోజుకు వందలాది క్యాన్లు విక్రయిస్తూ లక్షల రూపాయల వ్యాపారం సాగుతున్నప్పటికీ, ఆ నీటి నాణ్యతపై అధికారిక పర్యవేక్షణ ఎంత మేరకు ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్ఓ ప్లాంట్లకు అవసరమైన లైసెన్సులు, నీటి నిర్దిష్ట వ్యవధిలో ల్యాబ్ పరీక్షలు, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరి. అయితే మండలంలోని కొన్ని ప్లాంట్లలో ఈ నిబంధనలు పూర్తిగా అమలవుతున్నాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతుల వివరాలు, నాణ్యత పరీక్షల నివేదికలు, లైసెన్సులను వినియోగదారులకు బోర్డులను కనిపించేలా ప్రదర్శించని కేంద్రాలు కూడా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో నీటి క్యాన్లు పరిశుభ్రంగా లేకపోవడం, నిల్వ ట్యాంకుల నిర్వహణ సరిగా లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. క్యాన్లను పద్ధతిలో శుభ్రపరుస్తున్నారా ఫిల్టర్లు,నిర్ణీత కాలానికి మారుస్తున్నారా లేక నీటి నమూనాలను గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే... మండలంలో ఇంత పెద్ద ఎత్తున నీటి వ్యాపారం జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల తనిఖీలు ఎంత తరచుగా జరుగుతున్నాయి? నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్లాంట్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కేంద్రాలు ఉన్నాయా? ఉంటే వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రజల ఆరోగ్యానికి నేరుగా సంబంధించిన ఈ అంశంపై సంబంధిత శాఖలు సమగ్ర తనిఖీలు నిర్వహించి, ప్రతి ఆర్ఓ ప్లాంట్ అనుమతులు, నీటి నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను బహిరంగంగా పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వినియోగదారుల్లో నమ్మకం పెంచేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు.ప్రజలు తాగేది నిజంగా మినరల్ వాటరేనా...? లేక మినరల్ అనే ముసుగులో మరో వ్యాపారం సాగుతోందా...? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఉందని స్థానికులు కోరుతున్నారు.